మళ్లీ బరితెగించిన పాకిస్థాన్‌ సైన్యం


 ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. భారత్‌, పాకిస్థాన్‌ దేశాల్లోనూ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. దీంతో రెండు దేశాల్లో పాలకులు ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌ సైన్యం మాత్రం తన దొంగబుద్ధి పోనిచ్చుకోవడంలేదు. తాజాగా రాజౌరీ జిల్లాలోని మాంజాకోట్‌ సెక్టార్లో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా గ్రెనేడ్లు, రాకెట్‌ లాంఛర్లతో విరుచుకుపడింది. అయితే పాకిస్థాన్‌ విసిరిన రాకెట్‌ లాంఛర్లు సమీపంలోని పౌర నివాసాలపై పడటంతో ఒక మైనర్‌ బాలిక సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన ఇద్దరిని రాజౌరిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.